నడిరోడ్డుపై విద్యార్థినికి తాళి కట్టాడు.. వీడియో - Telugu News - Mic tv
mictv telugu

నడిరోడ్డుపై విద్యార్థినికి తాళి కట్టాడు.. వీడియో

February 9, 2023

 

man from Mandya tied the mangal sutra to a college girl on road

లవర్స్ డే వస్తుందంటే చాలు.. కొంతమంది ‘వీర ప్రేమికులు’ సినిమా హీరోలా ఫీలై ఏవేవో పనికిమాలిన సాహాసాలు చేస్తుంటారు. ప్రేమికుల రోజున ఆర్యసమాజ్ లో పెళ్లిళ్లు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందని.. ఊరి చివరలో ఉన్న ఏదో గుళ్లల్లో పెళ్లి తంతు కానివ్వడం, లేదంటే అమ్మాయిని తన ఇంటి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తీసుకురావడం..వంటి పనులతో రచ్చ రచ్చ చేస్తారు. తాజాగా కర్ణాటకలోని మండ్యా జిల్లాలో ఓ యువకుడు అలాంటి పనే చేశాడు. కాలేజ్‌కి వెళ్లి వస్తున్న అమ్మాయిని రోడ్డు మీదనే అడ్డుకొని, హైవే రోడ్డు మీద ఆమెకు తాళి కట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

 

మండ్యాకు చెందిన ఓ యువతి ఎప్పటిలాగే ఆమె కాలేజ్ కు వెళ్లింది. తిరిగొస్తున్న క్రమంలో బెంగళూరు- మైసూరు హైవే రోడ్డు మీద ఆమె ముందు ఓ యువకుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తరువాత ఆ యువకుడు అమ్మాయిని చెంపదెబ్బ కొట్టాడు. యువతి చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఆ సమయంలో కాలేజ్ అమ్మాయి అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. తరువాత ఆ యువకుడు జేబులో ఉన్న తాళి తీసుకుని బెంగళూరు-మైసూరు హైవే రహదారి పక్కనే ఆమె మెడలో తాళికట్టేశాడు. ఆ సమయంలో హైవే పై వాహన సంచారం కూడా ఎక్కువగానే ఉంది.

పట్టపగలే ఆ అమ్మాయికి బలవంతంగా తాళికడుతుండగా … ఓ వ్యక్తి ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. మరో వ్యక్తి అడ్డుకోబోయే లోపు ఆ యువకుడు తాళి కట్టడం పూర్తి చేశాడు. ఆ అమ్మాయి యూనీఫామ్, మెడలో ఐడీ కార్డుతో స్పష్టంగా కాలేజీ అమ్మాయి అని అర్థమవుతోంది. అయితే మండ్యాలో ఈ విషయంలో ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద నడిరోడ్డులో కాలేజ్ అమ్మాయి మెడలో ఓ యువకుడు తాళి కట్టడం హాట్ టాపిక్ అయ్యింది.