కుక్కలా కనిపించడానికి ఒక వ్యక్తి 12 లక్షలు వెచ్చించాడు గుర్తుంది కదా?! ఇప్పుడు మరొకతను వోల్ఫ్ కాస్ట్యూమ్ కోసం 18 లక్షలకు పైగా ఖర్చు చేశాడు.
టోకో జెప్పెట్ అని పిలువబడే కంపెనీ జంతువుల్లా కనిపించే కచ్చితమైన దుస్తులను రూపొందిస్తున్నది. గతేడాది ఒక వ్యక్తి కుక్కలా కనిపించే దుస్తులను తీసుకున్నాడు. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అతను 2 మిలియన్ల యెన్ లు అంటే.. మన కరెన్సీలో 12.17 లక్షల రూపాయలను వెచ్చించాడు.
ఈ కంపెనీకి రెండో కస్టమర్ కూడా జపాన్ నుంచి సంప్రదించారు. అతను వోల్ఫ్ రియలిస్టిక్ కాస్ట్యూమ్ డిజైన్ చేయాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచి అతనికి జంతువులపై ప్రేమ. టీవీలో కొన్ని జంతు సూట్స్ చూసి తను కూడా అలా తయారవ్వాలనుకున్నాడు. కానీ అవి పర్ఫెక్ట్ అనిపించలేదు. అందుకే ఇన్ని రోజులు ఆగాడట.
జెప్పెట్ దుస్తులను పూర్తి చేయడానికి మొత్తం యాభై రోజులు పట్టింది. సరైన ఫీచర్ల కోసం నిజమైన తోడేళ్ల చిత్రాలను చాలా వరకు తీసుకున్నారట. అతను.. ‘చివరి ఫిట్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఇది నా కల నెరవేరిన క్షణం. నిజమైన తోడేలు రెండు కాళ్లతో నడిచినట్లుగానే ఉంది. నా ప్రాధాన్యతలన్నింటినీ సంపూర్ణంగా కవర్ చేయడమే కాకుండా, వెంటిలేషన్ వచ్చేలా కూడా చేశారు. పైగా ఎవరి సహాయం లేకుండా ధరించేలా డిజైనర్లు చాలా శ్రద్ధ చూపినట్లు ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
అతను తనకు తెలిసిన వ్యక్తుల నుంచి తీర్పును తెలుసుకోవడానికి తన నిజమైన గుర్తింపును దాచి పెట్టినట్లు వివరించాడు. తన అభిరుచి చూసి కొందరు నవ్వుకుంటారేమోనని తను ఇలా చేస్తున్నట్లు వివరించాడు. ఈ దుస్తులకు 30లక్షల యెన్లు.. అనగా మన కరెన్సీలో సుమారు 18.85 లక్షలు వెచ్చించాడు. మొత్తానికి కొత్తగా ఉన్న అతని రూపాన్ని మెచ్చుకున్నావారు ఉన్నారు. కేవలం దానికోసం అంత ఖర్చు చేయడమెందుకు అనేవాళ్లు లేకపోలేదు.