గాయపడిన భార్యతో సైకిల్‌పై 12 కి.మీ. - MicTv.in - Telugu News
mictv telugu

గాయపడిన భార్యతో సైకిల్‌పై 12 కి.మీ.

March 27, 2020

Man in Ludhiana takes injured wife on bicycle to hospital amid lockdown

కరోనా వ్యాప్తి నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా కొన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వాలు సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పేదసాదలు నానా కష్టాలు పడుతున్నారు.  లాక్ డౌన్ వల్ల ఓ నిరుపేద కుటుంబానికి అత్యంత దయనీయమైన కష్టం వచ్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యను ఓ వ్యక్తి తన సైకిల్‌పై ఎక్కించుకుని 12 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి కాలినడకన తీసుకువెళ్లాడు. పంజాబ్‌లోని లూధియానాలో చోటు చేసుకున్న ఈ ఘటన పలువురిని కలిచివేసింది. 

లాక్‌డౌన్‌తో వాహనాలు అందుబాటులో లేవనీ.. అంబులెన్స్ సిబ్బంది రూ.2 వేలు డిమాండ్ చేయడంతో ఇలా వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అంతా బంద్ ఉండటంతో మమ్మల్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్‌లో వెళదామని డ్రైవర్లను అడిగితే వారు రూ.2 వేల కన్నా తక్కువకు రామని అన్నారు. దీంతో అంత డబ్బు చెల్లించలేక నేనే సైకిల్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాను’ అంటూ సదరు మహిళ భర్త దేవ్‌దత్ రామ్ తెలిపాడు. ‘ఈ నెల 20న ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా అక్కడ జరిగిన ప్రమాదంలో నా భార్య గాయపడింది. ఫ్యాక్టరీ కార్మికులు ఆమెను భరత్ నగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్యులు ఆమెకు ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టు చెప్పడంతో కంగన్వాల్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది’ అని దేవ్‌దత్ చెప్పాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ముందే ఊహించి ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసి లాక్ డౌన్ ప్రకటించాల్సింది అని అంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.