భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త మాస్టర్ ప్లాన్ వేశాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి తన ఇంటికి రప్పించేందుకు.. కిడ్నాప్ చేద్దామనుకున్నాడు. 13 ఏండ్ల కాపురంలో భర్త తెలివితేటలని ముందగానే అంచనా వేసిన భార్య.. అతడి ప్లాన్‌ను పసిగట్టి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న భర్త… ప్లాన్ లో చిన్న ఛేంజ్ చేసి బావమరిదిని, అతడి భార్యని కిడ్నాప్ చేశాడు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మామపై దాడి..
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్కు చెందిన విజయ(28)కు నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన శంకర్‌తో 13 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ముగ్గురు సంతానం. నాదర్గుల్లో ఉంటున్న వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో విజయ పుట్టింటికి, శంకర్ లింగాలకు వెళ్లిపోయారు. ఈ నెల 5న శంకర్ కొందరితో వచ్చి అత్తగారింటిపై దాడి చేయడంతో విజయ తండ్రి జగ్య తలకు గాయమైంది. మంగళవారం ఇంట్లో ఉన్న వాళ్లందరినీ కిడ్నాప్ చేయడానికి లింగాల నుంచి శంకర్ రెండు తుఫాన్ వాహనాల్లో బయల్దేరగా.. విషయం తెలిసిన విజయ తండ్రి జగ్యతో కలిసి ఆదిభట్ల పీఎస్‌కు వెళ్లి సమాచారం ఇచ్చింది.
లింగాలలో అరెస్ట్
దీంతో శంకర్ ఆ ప్లాన్ మార్చుకొని.. తన భార్యను కాకుండా కూలి పనికి వెళ్లిన బావమరిది కృష్ణ, అతని భార్య పద్మను కిడ్నాప్ చేసి, లింగాలకు తీసుకువెళ్లాడు. భార్యకు ఫోన్ చేసి తన వద్దకు రావాలని బెదిరించాడు. అప్పటికే పోలీసుల వద్ద ఉన్న విజయ ఈ విషయాన్ని వారికి చెప్పింది. వెంటనే ఆదిభట్ల పోలీసులు ఫోన్ ద్వారా లింగాల పోలీసులకు సమాచారం అందించగా.. అపహరణకు గురైన కృష్ణ, పద్మ దంపతులను కాపాడారు. వారితో కుటుంబసభ్యులకు ఫోన్ చేయించి మాట్లాడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఆదిభట్ల పోలీసులు.