ఉద్యోగాల పేరిట మోసాలు ఎక్కువైపోతున్నాయి. మాటలతో మాయచేసి లక్షల్లో డబ్బులను గుంజేస్తున్నారు కేటుగాళ్ళు.సామాన్యుల నుంచి అంతకొంత తెలిసివారు కూడా ఇలాంటి మోసాల్లో బాధితులుగా మారిపోతున్నారు.తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ హోంగార్డు 27.5 లక్షలు పోగొట్టుకున్నాడు. అతడికి సీటీవో, భార్యకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు నిందితులు విడతలవారీగా డబ్బులను లాగేశారు. ఎప్పటికీ ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూబోయిన పల్లి పోలీస్ క్వార్టర్స్ లో ఉండే అంతయ్య అనే హోంగార్డుకు గతేడాది నకిరేకల్ కు చెందిన భగ్వాన్దాస్ అనే వ్యక్తితో పరిచయమయింది. తర్వాత అతడు తన స్నేహితుడైన మంగులాల్ను అంతయ్యకు పరిచయం చేశాడు. అతడు మంగులాల్ రైల్వేలో పనిచేస్తున్నాడని..ఉద్యోగాలు ఇప్పిస్తాడని చెప్పాడు. వీరి మాటలు నమ్మిన అంతయ్య తనకు, తన భార్యకు ఉద్యోగాలు కావాలని కోరాడు. ఇందుకు విడతలవారీగా రూ. 27,50,000 చెల్లించాడు. తర్వాత ఉద్యోగాల కోసం మంగులాల్, భగ్వాన్దాస్ లను ప్రశ్నించగా సమాధానం దాటవేస్తూ వచ్చారు. చివరికి అనుమానం రావడంతో విచారించగా వారు చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన.. అంతయ్య పోలీసులను అశ్రయించాడు. మిర్యాలగూడకు చెందిన మంగులాల్ పై గతంలో కూడా ఇలాంటి తరహా కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.