‘ఏవండీ.. ఆవిడ వచ్చింది’ అనే పాత తెలుగు సినిమాలో.. ఇద్దరు భార్యలున్న ఆ హీరోని.. వారంలో చెరో మూడు రోజులు పంచుకుంటారు. ఇక ఏడవ రోజైన ఆదివారం సెలవు దినంగా విశ్రాంతి తీసుకునేందుకు తల్లిదండ్రులు వద్ద ఉంటాడా హీరో. నవ్వులు పూయించిన ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాన్ని.. రియల్ లైఫ్‌లో ఓ న్యాయమూర్తి.. అదే తన తీర్పుగా చెప్పాడు. ఏ భార్యకు ఇబ్బంది కలగకుండా భర్తను సమానంగా విభజించాడు. “ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య వద్ద మూడు రోజులు ఉండండి. ఆదివారం మీ ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు’’ అని ఆఖరి మాటగా తెలిపాడు.
విషయంలోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన వ్యక్తి హర్యానాలో ఓ MNC కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో భార్యను అతడు పుట్టింటికి పంపాడు. ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ అతడు తన భార్యను ఇంటికి తీసుకురాకుండా హర్యానా వెళ్లిపోయాడు. అక్కడ తన సహోద్యోగి అయిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
మరోవైపు, భర్త వస్తాడని, తనను తీసుకెళ్తాడని చూసి చూసి విసిగిపోయిన మొదటి భార్య చివరికి తనే హర్యానా వెళ్లింది. అక్కడ తన భర్త మరో మహిళతో కాపురం చేస్తుండడంతో విస్తుపోయింది. ఆ తర్వాత గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరికి ముగ్గురితో కలిసి చర్చలు జరిపిన తర్వాత భార్యలు ఇద్దరు అతడితో కలిసి ఉండేందుకు అంగీకరించడంతో భర్తను కోర్టు సమానంగా విభజించింది.
ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య దగ్గర మూడు రోజులు గడిపాలని, ఆదివారం మాత్రం అతడి ఇష్టమని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన భర్త భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.