అమంగట్టు చలిల్ కన్నన్ అయ్యప్ప మాల వేసుకున్నాడు. మలప్పురం నుంచి శబరిమల వరకు అంటే దాదాపు 300 కి.మీ.లు వీల్ చెయిర్ లో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 10 రోజుల యాత్ర కూడా ముగిసింది.
కన్నన్ చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. అతని మరొక కాలు పాక్షికంగా పక్షవాతానికి గురైంది. అతని ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసా? అతను ఇక భవిష్యత్తే లేదనుకున్న సమయంలో తనకు సహాయం చేసిన ముస్లిం ఉపాధ్యాయునికి అయప్ప భగవానుడి ఆశీర్వాదం అందాలని ఈ యాత్ర మొదలు పెట్టాడు.
2013 డిసెంబర్ 3 వ తేదీన లారీ నుంచి కలప దుంగలను దించే క్రమంలో కన్నన్ ఎడమ కాలు తెగిపోయింది. ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకుతో కుటుంబాన్ని ఒక్కడే నెట్టుకొచ్చేవాడు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబం కూడా అవిటిదయిపోయింది. ఆ సమయంలో కొండొట్టిలోని ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎం.పి.సమీర, కళాశాల నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ కు కో ఆర్డినేటర్ గా కూడా పనిచేస్తున్నారు. కన్నన్ గురించి తెలుసుకొని ఎన్ ఎస్ ఎస్ యూనిట్ అతని కోసం ఒక ఇంటిని నిర్మించింది.
జీవితాన్ని మార్చింది..
‘నా జీవితాన్ని మార్చింది సమీర టీచర్. ఆమె నాకు, నా కుటుంబానికి దేవుడితో సమానం. అయప్పకు నేను అమితమైన భక్తుడిని. ఈ ప్రయాణం సమీర టీచర్ కోసమే. నేను సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వీల్ చెయిర్ లో నా ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. అది మధ్యాహ్నం వరకు సాగుతుంది. శబరిమల యాత్రికుల కోసం దేవాలయాలు లేదా అన్నదానం కౌంటర్ల నుంచి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను, కాసేపు నిద్రపోతాను. తిరిగి ప్రయాణం సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి దేవాలయాల్లో గడుపుతాను’ అంటున్నాడు కన్నన్. తమిళనాడు నుంచి కేరళకు వలస వచ్చిన కన్నన్ డిసెంబర్ 15న శబరిమల యాత్ర మొదలు పెట్టాడు. జనవరి మొదటి వారం నాటికి కన్నన్ అయప్ప ఆలయానికి చేరుకుంటానని చెబుతున్నాడు. కన్నన్ పెద్ద కూతురు పారా మెడికల్ విద్యార్థిని కాగా, మిగతా వారు పాఠశాలల్లో చదువుతున్నారు. హోటల్ లో క్లీనింగ్ సిబ్బందిగా భార్య సతీదేవి కుటుంబాన్ని పోషిస్తున్నది. గత నెల నుంచి కన్నన్ తన ఆదాయాన్ని పెంచేందుకు లాటరీ టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించాడు.