దీపావళి ఆఫర్ అని ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టాడు.. పార్శిల్ చూసి షాక్. - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళి ఆఫర్ అని ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టాడు.. పార్శిల్ చూసి షాక్.

October 26, 2022

Man ordered laptop from Flipkart, got stone in delivery

దీపావళి ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబరు 15న ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేశాడు. తీరా పార్సిల్‌ వచ్చాక తెరచి చూస్తే.. అందులో రాయి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. వెంటనే కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేసి సమస్యను చెప్పినా తొలుత ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు అతికష్టం మీద డబ్బును తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి.

ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో.. ఈ కామర్స్‌ సంస్థలు ‘ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ’ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. కస్టమర్‌ కోరితే.. ఐటమ్‌ డెలివరీ చేసేముందు డెలివరీ చేసే వ్యక్తి పార్సిల్‌ను తెరిచి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసినప్పుడే వినియోగదారుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా ఘటనలో ఆ వ్యక్తి ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోలేదు. పార్సిల్‌లో రాయి వచ్చిందన్న సంగతి గమనించి..వెంటనే అమ్మకం దారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు. అయితే, ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఎంచుకోనందున రిఫండ్‌ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పడంతో.. తాను ఆర్డర్‌ చేసిన ఈ కామర్స్‌ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అన్ని ఆధారాలు జత చేస్తూ ఈమెయిల్‌ చేశాడు. సదరు ఈ కామర్స్‌ సంస్థ జోక్యం చేసుకోవడంతో మొత్తం సొమ్మును రిఫండ్‌ వచ్చింది.