చిన్న చిన్న కారణాలకే మన దగ్గర మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ తుపాకీ కల్చర్ ఉన్న దేశాల్లో అవే చిన్న కారణాలకు ఎదుటివారిని చంపేస్తుంటారు. బ్రెజిల్‌లో జరిగిన తాజా ఘటనే అందుకు ఉదాహరణ. పూల్ గేమ్‌లో రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి తనను చూసి నవ్వారని ఏడుగురిని నిలబెట్టి కాల్చి చంపేశాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్ నగరవాసి అయిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరాకి పూల్ గేమ్ ఆడే అలవాటుంది.
అతను గత మంగళవారం స్థానిక గేమ్ సెంటర్‌కి వెళ్లి 4 వేల బ్రెజిల్ కరెన్సీతో పందెం కాశాడు. ఓడిపోవడంతో కాసేపటి తర్వాత స్నేహితుడు రెబిరోని తోడుగా తెచ్చుకుని మళ్లీ పందెం కాశాడు. రెండో సారి కూడా ఓటమి పాలవడంతో పక్కన ఉన్న వ్యక్తులు కొందరు రికార్డోను చూసి నవ్వారు. దీంతో ఆగ్రహానికి గురైన రికార్డో స్నేహితుడు రెబిరోతో కలిసి ఘోరానికి పాల్పడ్డారు. గన్‌తో అక్కడున్న వారిని బెదిరించి వరుసలో నిలబెట్టి కాల్పులు జరిపాడు. దీంతో పూల్ ఓనర్ సహా ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.