హైదరాబాద్‌లో వాన ఘోరం.. ఫుట్‌పాత్‌పై కరెంట్ షాక్‌తో మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వాన ఘోరం.. ఫుట్‌పాత్‌పై కరెంట్ షాక్‌తో మృతి 

October 17, 2020

nnghn

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం నగరవాసులను గుబులు రేపుతోంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అయిన వానను చూసి ప్రజలు మళ్లీ జంకుతున్నారు. మొన్నటిలా వాన భారీగా పడితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. పురాతనమైన ఇళ్లల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే పాతబస్తీ, బాబానగర్ ప్రాంతాల్లో అధికారులు, స్థానికులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఈ వానల్లో ఏ చెట్టు కింద నిలబడదామన్నా భయమే. ఎందుకంటే ఏ సమయంలోనైనా బలమైన గాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగి మీద పడవచ్చు. అలాగే వరదలో నడవాలన్నా భయమే.. ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందనే గుబులు. పైగా వరదల్లో మనుషులు కొట్టుకుపోతున్నారు. అలాగే ఫుట్‌పాత్ మీద నిలుచోవాలన్నా బెరుకే.. కరెంట్ తీగలు తెగ మీద పడవచ్చు. ఇలా వాన మొదలైందంటే పలు దిక్కుల నుంచి ఇతరాత్రా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భారీగా కురిసిన వాన కారణంగా మళ్లీ అన్ని చోట్ల వరద నీరు వచ్చి చేరుతోంది. 

ఈ క్రమంలో ఓల్డ్ మలక్ పేటలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై తెగిపడ్డ విద్యుత్ తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అతను రోడ్డుపై వెళుతున్న సమయంలో పొరపాటున కరెంట్ పోల్‌కు తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే రాములు (40)గా గుర్తించారు. అతనిది శ్రీకాకుళం జిల్లా కాగా, బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చినట్టు చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు. మలక్ పేట యశోదా ఆసుపత్రి చౌరస్తా నుంచి శంకర్ నగర్‌లోని తన ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో భారీ వర్షం వచ్చింది. దీంతో అమ్మవారి ఆలయం ఫుట్‌పాత్ పైకి ఎక్కాడు. అనుకోకుండా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ముట్టుకోగా, విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రాములు మృతితో అతని కుటుంబంలో తీరని విషాధం నిండింది. కాగా, ఆ ప్రాంతంలో సంచరించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై విద్యుత్ స్తంభాలను తాకరాదని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.