మనసు మార్చిన లాక్‌డౌన్.. 27 ఏళ్ల తర్వాత ఇంటికి - MicTv.in - Telugu News
mictv telugu

 మనసు మార్చిన లాక్‌డౌన్.. 27 ఏళ్ల తర్వాత ఇంటికి

May 22, 2020

Man returns home after 27 years to find parents, wife no more

లాక్‌డౌన్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నా అక్కడక్కడా కొన్ని మంచి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రితో ఏర్పడ్డ మనస్పర్థలతో ఓ కొడుకు ఇల్లు వదలి పెట్టి వెళ్లిపోయాడు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్ కారణంగా 27 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మెహంగీ ప్రసాద్‌‌కు ఇంట్లో నిత్యం తండ్రితో గొడవలు జరుగుతుండేవి. దీంతో ప్రసాద్ 1993లో తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని వదలి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అప్పుడు అతడి వయసు 36 ఏళ్లు. ప్రసాద్‌ వెళ్లిపోయాక అతని ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎంతగా గాలించినా అతని ఆచూకీ లభించలేదు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. 

ప్రసాద్‌ ముంబై వెళ్లి అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ రావడంతో లాక్‌డౌన్‌ విధించగా.. అతనికి పనుల్లేకుండా పోయాయ. దీంతో అతడి మనసు ఇంటివైపు లాగింది. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మే 6న ముంబై నుంచి బయలుదేరి, 1100 కిలోమీటర్లు ప్రయాణించి ఊరికి చేరుకున్నాడు. అయితే కుటుంబ సభ్యుల ఆచూకీ కనుక్కోవటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో గ్రామంలో క్వారెంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. క్వారెంటైన్‌ తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అతని వయసు ఇప్పుడు 63 ఏళ్లు. 27 ఏళ్ల తర్వాత తన తండ్రిని చూసేసరికి అతడి కూతురు సంతోషం పట్టలేకపోయింది. కాగా, తల్లిదండ్రులు, భార్య మరణించారని తెలుసుకుని అతడు చాలా బాధపడ్డాడు. కోపంలో ఇంటినుంచి వెళ్లిపోయి పెద్ద తప్పు చేశానని కన్నీరుమున్నీరయ్యాడు.