man selling milk on a Harley Davidson bike is viral on social media
mictv telugu

బాబు బాగా రిచ్.. హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై పాల వ్యాపారం

January 5, 2023

ఒకప్పుడంటే.. పొద్దున్నే సైకిళ్ల మీద తిరుగుతూ.. పాల ప్యాకెట్లు, పేపర్లు వేసేవాళ్లు కొందరు. కాలం మారింది. జనాలు కూడా మారారు. అందుకు తగ్గట్టే ప్రతీ పని కూడా వేగంగా చేసేందుకు పలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఉదాహారణకు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లాగా.. పాలు పోసేవారు, పేపర్ వేసే వారు కూడా బైక్స్ వాడుతున్నారు. వీరంతా టీవీఎస్ ఎక్స్ఎల్100 అది కాకుంటే బజాజ్ ప్లాటినా, స్ప్లెండర్ వంటి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను వినియోగిస్తారు. తాజాగా ఓ వ్యక్తి అత్యంత ఖరీదైన బైక్‌పై ఇంటింటికి తిరుగుతూ పాలు పోస్తున్న వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ‘హార్లీ డేవిడ్‌సన్’ ది ఫస్ట్ ప్లేస్. ఖరీదు ఎక్కువ కావడం వల్ల చాలామంది కొనలేకపోతారు. అయితే ఈ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి హార్లీ డేవిడ్‌సన్ బైకుకి వెనుకవైపు రెండు పాల క్యాన్లను తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. బైక్ వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ మీద నెంబర్ కి బదులుగా ఇంగ్లిష్ లో ‘గుజ్జర్’ అని రాసి ఉంది. ఈ వీడియోను amit_bhadana_3000 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసాడు. ఈ వీడియోకి దాదాపు 1.90 లక్షల లైకులు, 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బహుశా హార్లీ డేవిడ్‌సన్ రైడ్ చేసే వ్యక్తి తమ కుటుంబీకులకు సహాయం చేయడానికి ఈ పని చేస్తున్నాడేమో అని కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం తెలియదు.