కాపురంలో చిచ్చుపెట్టిన కరోనా అనుమానం.. శాడిస్టు మొగుడితో ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

కాపురంలో చిచ్చుపెట్టిన కరోనా అనుమానం.. శాడిస్టు మొగుడితో ఇలా

March 26, 2020

Man Sent His Wife And Son Out Due to Corona  

కరోనా వైరస్ వ్యాపించకుండా మనిషికి మనిషి సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకూడదని, ఒకవేళ వస్తే మరొకరికి వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో కరోనా అనుమానం ఓ శాడిస్టు భర్తకు పెను భూతంలా మారిపోయింది. కొడుక్కు అనారోగ్యంగా ఉండటంతో వైరస్ సోకిందనే అనుమానంతో ఇద్దరిని పుట్టింటికి వెళ్లాలంటూ ఇంట్లోంచి గెంటేశాడు. తూర్పుగోదావరి జిల్లా  చింతూరు మండలం కొత్తపల్లిలోఈ ఘటన చోటు చేసుకుంది. 

సుకుమామిడికి చెందిన కుండ్ల రాజారెడ్డి, లక్ష్మి దంపతులకు మూడో తరగతి చదువుతున్నకొడుకు సంజీవరెడ్డి ఉన్నాడు. నాలుగు రోజులుగా అతడు టైఫాయిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో అతడికి కరోనా సోకిందంటూ రాజారెడ్డికి లేనిపోనివి నూరిపోశారు. ఇరుగు పొరుగు మాటలు పట్టుకొని భార్యను కొట్టి.. కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఈ ఘటనతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక ఎస్సై బాలుడికి పరీక్షలు జరిపించగా కేవలం జ్వరం మాత్రమే ఉందని తేల్చారు. దీంతో స్థానికులతో మాట్లాడి, రాజారెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 

ఇంకోసారి ఇలాంటి అనుమానాలు రేపితే కఠిన చర్యలు ఉంటాయని స్థానిక ప్రజలను కూడా హెచ్చరించారు.  ఇలా బుర్రతక్కువ మనుషులు కూడా ఉన్నారు లోకంలో.. కాగా కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటే పట్టించుకోకుండా బాధ్యతా రహిత్యంగా వ్యవహరించిన రాజారెడ్డి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.