Man slaps guard at Gurgaon society after being briefly stuck in lift, arrested
mictv telugu

ప్రాణం కాపాడినందుకు చెంప దెబ్బలు తిన్నాడు.. కంప్లైంట్ ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్

August 30, 2022

సాయం చేసినవాడికి కృతజ్ఞత భావంగా ధన్యవాదాలు చెబుతాం. అదే ప్రాణం కాపాడిన వాడికైతే సాష్టాంగ నమస్కారం చేసినా తక్కువే. కానీ గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడగానే తనను రక్షించిన వ్యక్తిపై చిందులేశాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అతని చెంపలు చెడామడా వాయించాడు. ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌లోని క్లోజ్ నార్త్ సొసైటీకి చెందిన వరుణ్ నాథ్ తానుంటున్న అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి కిందికి వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో లిఫ్ట్‌లో అమర్చిన ఇంటర్‌కమ్ ద్వారా సెక్యూరిటీగార్డు అశోక్‌కు సమాచారం అందించాడు. దీంతో లిఫ్ట్‌మ్యాన్‌ను అక్కడికి తీసుకెళ్లిన అశోక్ సమస్యను సరిదిద్దాడు. ఇందుకు ఐదు నిమిషాలు పట్టింది. మొత్తానికి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వరుణ్ నాథ్ ఆ వెంటనే ఆగ్రహంతో ఊగిపోతూ సెక్యూరిటీ గార్డుపై చిందులేశాడు. అతడి చెంపలు చెడామడా వాయించాడు. అంతేకాదు, ఆ తర్వాత లిఫ్ట్‌మ్యాన్‌పైనా దాడిచేసి చెంపలు వాయించాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

దీంతో ఆగ్రహించిన దక్లోజ్ నార్త్ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా సమ్మెకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా పని చేయడం మానేశారు. సొసైటీ వాసులకు తమ సేవలను అందించేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని, కొంతమంది మాత్రం తమను బానిసలుగా భావిస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు వరుణ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గురుగ్రామ్ పోలీసులు నిందితుడు వరుణ్ నాథ్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 323 (బాధ కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.