తెలంగాణలో ఘోరం.. వేరే మతం వాడిని పెళ్లాడిందని చంపేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఘోరం.. వేరే మతం వాడిని పెళ్లాడిందని చంపేశారు..

May 5, 2022

 

రాష్ట్రంలో మ‌రో ప‌రువు హ‌త్య జ‌రిగింది. పెద్దలను కాదని ప్రేమించి మతాంతర వివాహం చేసుకుందని.. యువతి కుటుంబసభ్యులు ఆమె భర్తపై ఇనుప రాడ్‌లు, క‌త్తుల‌తో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. హైదరాబాద్ న‌గ‌రంలోని సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. న‌డిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది.

రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్‌ సుల్తానా (23) గ‌త ప‌దేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్‌ సుల్తానా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో నాగరాజు జనవరి 31న ఆర్యసమాజ్‌లో ఆశ్రిన్‌ సుల్తానాను వివాహం చేసుకున్నాడు. త‌మ ప్రేమను అంగీక‌రించ‌ని ఆశ్రిన్ కుటుంబ స‌భ్యులు.. వివాహం గురించి తెలిస్తే చంపేస్తార‌ని ముందే ప‌సిగ‌ట్టిన ఈ జంట‌.. పెళ్లి అయిన వెంట‌నే ఏపీలోని విశాఖ‌ప‌ట్నంకు వెళ్లి అక్క‌డే రెండు నెల‌లు ఉన్నారు. ఆ త‌ర్వాత అంత సద్దుమ‌ణిగి ఉంటుంద‌ని భావించి ఇటీవ‌లే హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు నాగ‌రాజుపై దాడి చేయాల‌ని మాటు వేశారు. స‌రిగ్గా అద‌ను చూసి బంధువుల ఇంటికి బైక్‌పై వెళుతున్న నాగరాజు, ఆశ్రిన్‌ల‌పై… ఆశ్రిన్‌ సోదరుడు, అతడి స్నేహితుడు దాడికి పాల్పడ్డారు. నాగరాజును ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు.ఈ దారుణ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఆశ్రిన్‌ సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు బంధువులు ఆశ్రిన్‌ను వెంట తీసుకెళ్లారు.