కేజీ ఉల్లి కోసం.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు - MicTv.in - Telugu News
mictv telugu

కేజీ ఉల్లి కోసం.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

December 9, 2019

Onions Gudivada 01

ఉల్లి కొరత ఇప్పటి వరకు జేబులకు చిల్లు మాత్రమే పెట్టింది. కానీ ఈ పరిస్థితి మనుషుల ప్రాణాల మీదకు తెచ్చే స్థాయికి వెళ్లిపోయింది. ఆకాశాన్నంటిన ధరల కారణంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సీడి ఉల్లి కొనేందుకు వెళ్లి క్యూలైన్లో ఓ వృద్ధుడు మరణించాడు. ఒత్తిడి తట్టుకోలేక సాంబయ్య అనే వ్యక్తి సోమవారం ఉదయం మృతి చెందాడు. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రజలు నిర్వాహకుల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉల్లి ధరలు బహిరంగ మార్కెట్లలో రూ. 190కి చేరింది. ఏపీ ప్రభుత్వం రైతు బజార్లలో కౌంటర్లు తెరిచి సబ్సీడి రూపంలో రూ. 25కే కిలో ఉల్లి ఇస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్లు పెరిగిపోయాయి. తెల్లవారుజాము నుంచే కౌంటర్ల వద్ద జనం గుమిగూడుతున్నారు. ఉదయం నుంచి క్యూలో నిల్చున్న సాంబయ్య తనకు ఉల్లి దొరుకుతుందో లేదో అన్న టెన్షన్‌‌తో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉల్లి కోసం వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.

గంటల కొద్ది క్యూలో నిల్చోవడం వల్లే ఈ  పరిస్థితి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. సబ్సిడీ ఉల్లిని అందించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఆరోపించారు. కాగా ఇప్పటికే గత ఐదు రోజుల నుంచి ఉల్లి కౌంటర్లకు తాకిడి పెరగడంతో పోలీసుల పహరా మధ్యే ఉల్లి అమ్మకాలు జరుగుతున్నాయి.