man suffered mental illness due to Love failure
mictv telugu

లవ్ ఫెయిల్యూర్.. నిజంగానే పిచ్చివాడై బిచ్చగాడయ్యాడు..

July 19, 2022

‘ప్రేమిస్తే’ సినిమా గుర్తుందా? నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలోని హీరో.. తన ప్రియురాలు విడిచి వెళ్లిపోయేసరికి పిచ్చోడిలా మారిపోతాడు. సరిగ్గా ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కథ కూడా అదే. అయితే ఆ సినిమాలో హీరో చదువు రాని ఓ మెకానిక్ అయితే.. ఈ వ్యక్తి మాత్రం ఉన్నత విద్యావంతుడు, ప్రభుత్వోద్యోగి. ప్రేమించిన అమ్మాయి తనను కాదని వెళ్లేసరికి భరించలేక.. పిచ్చోడిలా మారిపోయాడు. వివరాలిలా.. తమిళనాడు, తెన్‌కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35) మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఎంబీఏ చదువుతున్న టైంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే, ఆ ప్రేమ ఫెయిల్‌ అయింది. ఆ బాధ నుంచి తేరుకుని అతడు బయట పడ్డానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత చెన్నైలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగంలో చేరాడు. ఆఫీస్‌లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే, ఈసారి కూడా ప్రేమ బెడిసి కొట్టింది. దీంతో తట్టుకోలేకపోయాడు.

2018 నవంబర్‌ 13న తను ఉంటున్న వర్కింగ్‌ బాయ్స్‌ హాస్టల్‌ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఎంత వెతికినా అతడి జాడ కనిపించలేదు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ముత్తు సమీప బంధువు మురుగన్‌ అతడ్ని గుర్తు పట్టలేని స్థితిలో పిచ్చివాడిగా గుర్తించాడు. ముత్తుతో మాటలు కలిపి ఆరా తీశాడు. ఊరు, పేరు చెప్పిన తర్వాత పిచ్చివాడు ముత్తునేనని నిర్థారించుకున్నాడు. పోలీసుల సహాయంతో అట్టలు కట్టిన పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి గుండు కొట్టించాడు. అనంతరం పోలీసులు ముత్తును తల్లిదండ్రులకు అప్పగించారు. ముత్తు సోదరుడు అయ్యనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముత్తు ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు. రెండు సార్లు ప్రేమ విఫలం కావటంతో పిచ్చివాడిలా మారాడు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్ఛగాడిలా ఇన్నాళ్లూ గడిపాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.