సముద్రంలో ఒకే ఒక్కడు 28 రోజులు.. రియల్ లైఫ్ ఆఫ్ పై  - MicTv.in - Telugu News
mictv telugu

సముద్రంలో ఒకే ఒక్కడు 28 రోజులు.. రియల్ లైఫ్ ఆఫ్ పై 

October 26, 2019

Man survived in sea real life of pi 

‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా నిజ జీవితంలోనూ జరిగింది. ఓ మనిషి సముద్రంలో 28 రోజులపాటు నిత్యం గండాలు ఎదుర్కొంటూ గడిపేశాడు. చుట్టూ ఉప్పునీరు తప్ప ఏమీ కనిపించని ప్రపంచంలో ఆశను ఉగ్గబట్టుకుని తీరం కోసం వేచి చూశాడు. చివరకు అతని ఆశ నెరవేరి ఒడ్డు సాదారంగా ఆహ్వానించి ప్రాణాలు నిలిపింది. 

అండమాన్‌కు చెందిన 49 ఏళ్ల అమృత్ కుజుర్ గత నెల 28న తన స్నేహితుడు దివ్యరాజన్‌తో కలసి సముద్రంలోకి వెళ్లాడు. సముద్రంలో రాకపోకలు సాగించే నౌకలకు తిండిగింజలు, మంచినీరు సరఫరా చేసే వ్యాపారం కోసం ఇద్దరూ రూ. 5 లక్షల సరుకుతో కడలిలోకి వెళ్లారు. మరపడవలో షాహిద్ ద్వీప్ నుంచి బయల్దేరిన వీరి మరపడవ  తుపాను చిక్కుకుని దారి తప్పింది. ఇంధనం అయిపోయింది. తుపాను దెబ్బకు పడవ దెబ్బతింది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా నాశనమైంది. పడవ మునిగిపోకుండా సరుకును సముద్రంలో పారేశారు. చుట్టుపక్కల ఒక్క నౌకా కనిపించలేదు. చివరికి మయన్మార్ నేవీ నౌక ఒకటి వారికి చేరువగా వచ్చింది. 260 లీటర్ల డీజిల్‌, దిక్సూచి(కంపాస్‌) అందజేసింది. బతుకు జీవుడా అంటూ అండమాన్‌కు వెళ్తుండగా మరో తుపాను విరుచుకుపడింది. పడవ దెబ్బతిని దివ్యరాజన్ చనిపోయాడు. అమృత్ తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీరు లేక అల్లాడిపోయాడు. పడవ బరువు తగ్గించుకోడానికి సహచరుడి మృతదేహాన్ని సముద్రంలో వదిలేశాడు. వాన నీటిని ఒడిసిపట్టుకుని తాగాడు. తిండి లేక తాను కూడా చనిపోతానని భావించాడు. కానీ విధి కనికరించింది. అతని పడవ శుక్రవారం ఒడిశాలోని కిరిషాహీ తీరానికి కొట్టుకొచ్చింది. పోలీసులు అమృత్‌ను కాపాడి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తుపాన్ల మధ్య.. బయల్దేరిన ప్రాంతం నుంచి 1300 కి.మీ. దూరంలోకి కొట్టుకొచ్చిన అతని తెగువను జనం మెచ్చుకుంటున్నారు.