బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌పై కొందరు దుండగులు చెప్పులు వేసిన సంగతి తెల్సిందే. తేజస్వి యాదవ్ ఔరంగాబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. తాజాగా బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై కొందరు దుండగులు చెప్పులు విసిరారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం ముజఫర్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీని ముగించుకుని హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. నిందితులు విసిరిన చెప్పులు నితీష్‌కు తగలలేదు. చెప్పులు విసిరారని అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు విడతల పోలింగ్ జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28 మొదటి దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 3, 7 తేదీల్లో రెండవ, మూడవ దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది.