ఢిల్లీలో కాల్పులు జరిపిన ‘షారుఖ్’ అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో కాల్పులు జరిపిన ‘షారుఖ్’ అరెస్ట్.. 

February 25, 2020

Shahrukh

దేశ రాజధాని ఢిల్లీలోని జాఫ్రాబాద్ ప్రాంతంలో సీఏఏ వ్యతిరేక, మద్దతుదారుల ఆందోళనలలో కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు అనే సస్పెన్స్‌కు తెరపడింది. అతను ఎవరు అనే విషయంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంలో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అసలు నిందితుడు ఎవరో పట్టుకున్నారు. నిందితుడి పేరు షారుఖ్ అని.. 33 ఏళ్ల వయసు ఉన్న అతను షాదార ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తేల్చారు. కాల్పుల సమయంలో రికార్డు అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. జాఫ్రాబాద్ ప్రాంతంలో ఆందోళకారుల మధ్య నుంచి వచ్చిన ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి మరో వైపున ఆందోళన చేస్తున్నవారిపై కాల్పులు జరిపి గుంపులో కలిసిపోయాడు. వెళ్తున్న సమయంలో అతడిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై తుపాకీ గురిపెట్టి నెట్టివేశాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 

షారూఖ్ మీద ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోం మంత్రి అమిత్‌ షా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజల్‌, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, మరికొంత మంది రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు మృతిచెందారు.