మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరి స్నేహితురాళ్ల ప్రేమ వ్యవహారం ప్రాణాంతకంగా మారింది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు యువతులు ప్రేమికులుగా మారి కొన్నాళ్లు సహజీవనం చేశారు. కొన్నాళ్లు వీరిద్దరి ప్రేమ కహానీ బాగానే ఉన్నా ఏమయ్యిందో ఏమో ఒక యువతి హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన 21 ఏళ్ల అంజలికి, మన్నెగూడంకు చెందిన మహేశ్వరికి పరిచయం ఏర్పడింది. అంజలి ఓ కళ్లద్దాల షాపులో పనిచేస్తోంది. మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పని చేసి ఈ మధ్యనే మానేసింది.
మహేశ్వరి అమ్మాయే అయినప్పటికీ మహేష్‌గా ఆమె పేరును మార్చుకుని గత పదేళ్లుగా ఆమె ప్యాంటు, చొక్కాలు వేసుకుంటూ అబ్బాయిలా వేషధారణ చేసుకోవడమే కాదు అబ్బాయిలా మారుతూ వచ్చింది. అంజలి, మహేశ్వరిల స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరద్దరూ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌తో అంజలికి పరిచయం ఏర్పడింది. దీంతో అంజలి మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన మహేశ్వరి కోపంతో రగిలిపోయింది. ఒకరోజు అంజలిని మామిడిగట్టుకు వెళ్దామంటూ రాత్రి 8.15 గంటలకు బైక్‌పై తీసుకెళ్లింది. తరువాత రాత్రి 11.30 గంటలకు శ్రీనివాస్‌కు మహేశ్వరి ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీనివాస్ అపస్మారక స్థితిలో ఉన్ అంజలిని, స్వల్పంగా గాయపడిన మహేశ్వరిని స్థానిక హాస్పిటల్‌కు తరలించాడు. మార్గమధ్యలోనే అంజలి చనిపోయింది. అంజలి మెడపై లోతైన గాయం ఉండటంతో మహేశ్వరే అంజలిని హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మహేశ్వరి, శ్రీనివాస్ లను విచారిస్తున్నారు.