శ్రీకాకుళం జిల్లాలో మంచు లక్ష్మి సందడి...సినిమా రేంజ్‌లో ఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాకుళం జిల్లాలో మంచు లక్ష్మి సందడి…సినిమా రేంజ్‌లో ఎంట్రీ

December 7, 2022

 

శ్రీకాకుళం జిల్లాలో నటి మంచు లక్ష్మి సందడి చేశారు. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో ఆమె పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్‌ను ఆమె ప్రారంభించారు. మంచు లక్ష్మి టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థలను నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధన అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్‌ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. గ్రామానికి వచ్చిన మంచులక్ష్మికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఓపెన్‌ టాప్‌ కారులో నిల్చొన్న ఆమెపై దారంతా పూలు చల్లుతూ ఆహ్వానం అందించారు.

ఇక డిజిటల్‌ విద్యాబోధన కోసం ఈ స్కూల్‌లో 3 లక్షల రూపాయాల ఖర్చుతో.. తరగతి గదిలో వాల్‌ పెయింటింగ్‌, ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. అంతేకాక విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు కూడా అందించారు. ఈ స్మార్ట్‌ క్లాస్‌ రూం కోసం మంచు లక్ష్మి ట్రస్ట్‌ నిధులను సమకూర్చింది. డిజిటల్‌ విద్యా బోధన కోసం గాను శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న స్టూడెంట్స్‌కి మెరుగైన విద్యను అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంచు లక్ష్మి తెలిపారు.