మనోజ్ కి మన్ కీ బాత్ ! - MicTv.in - Telugu News
mictv telugu

మనోజ్ కి మన్ కీ బాత్ !

June 14, 2017

మంచు మనోజ్ ట్విట్టర్లో ఆక్టర్ గా ‘ ఒక్కడు మిగిలాడు ’ నా ఆఖరి సినిమా అనడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో దూమారం దుమ్ము రేగుతోంది. అప్పుడే రిటైర్మెంటా ? నటన మీద అప్పుడే మొహం మొత్తిందా ? అంటే గింటే వాళ్ళ నాన్న మోహన్ బాబు ‘ ఇగ బస్ నటన, మాంచిగ ఇంట్ల కూసుండి మన్మరాన్లతోని ఆడ్కుంటనని ’ అంటే చల్తా గనీ.. మనోజ్ అనడమేంటి ? కొంపదీసి వాళ్ళక్కలా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తుతాడా ? ఎత్తినా అన్నలా హీరోగా కంటిన్యూ అవ్వచ్చు కదా ? మరి ఫ్యాన్స్ అంతా ఏమైపోవాలి ? సడన్ గా ఏ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్లో చేరాలి ? ‘ ??? ’ ఇన్ని జవాబు లేని సవాళ్ళు గుప్పుమంటున్నాయి.. కానీ ఇక్కడ చాలా చంది పప్పును కాలు మీద పోస్కున్నారు.. అసలు మనోజ్ ఇన్నర్ ఫీలింగేంటంటే…

‘‘ ఇంత వరకు నేను చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే.. అవే దాదాగిరి ఫైట్లు, జులుమ్ హీరోయిజాలు.., నటనకి ఆస్కారం లేకుండా పంచు డైలాగులు, పవర్ ఫుల్ హీరోయిజంతో, హీరోయన్ ఎంబట ఈగ చక్కర్లు కొట్టినట్టు కొట్టుడు, నాలుగు పాటలు, నాలుగు నగువరాష్కాలు, సొల్లు కార్చుకున్నట్టు సెంటిమెంటు…, ఇదే కదా ఇంత వరకు నేను సినిమాల్లో చేసింది. ఒక్కసారి నన్ను నేను క్వశ్చన్ వేస్కుంటే తెల్సిందేంటంటే నేను నటుణ్ని కాను, కమర్షియల్ ఆటగాణ్ని మాత్రమేనని. అందుకే హిందీ సినిమాల్లోని హీరోలను చూసి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు కథలో నాయకులుగా పర్ఫార్మెన్స్ చేస్తారు, అద్భుతమైన నటనతో స్టార్లవుతారు. కానీ మనం కథానాయకుల చుట్టూ కథను మలుపుకుంటాం, కథను కమర్షియల్ అనే పెంక మీద తాల్చి దబ్బిడి దిబ్బిడి చేస్తాం కదా.. అందుకే నేను ఈ ఫక్తు తెలుగు సినిమాల మత్తును వదిలించుకొని రియలైజ్ అయి హాలీవుడ్, బాలీవుడ్ హీరోలను ఇన్సి పిరేషన్ గా తీస్కొని చేసిన సినిమా ఒక్కడు మిగిలాడు !

దీని తర్వాత ‘ స్టార్ ’ కాకుండా ‘ ఆక్టర్ ’ అనిపించుకునే సినిమాలు చెయ్యనేమో… ’’ అనే వుద్దేశ్యంతోనే అన్నాడనిపిస్తోంది తప్ప తను పూర్తిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతాన్నట్టు కాదని నెటిజనులు, ఫ్యాన్స్ తెలుసుకుంటే మంచిదేమో ! మనోజ్ అందర్ కీ రాజ్ ను మన మిగతా కుర్ర కమర్షియల్ హీరోలు కూడా తెల్సుకొని ‘ ఆక్టర్ ’ అనిపించుకునే సినిమాలు చేస్తే బాగుంటుందేమో !!