ఊరంతా జనప సంచులు.. మంగళగిరి ఎమ్మెల్యే చొరవ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఊరంతా జనప సంచులు.. మంగళగిరి ఎమ్మెల్యే చొరవ..

November 16, 2019

mla . 

ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పీడిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధాన్ని ప్రకటిస్తున్నాయి. మన దేశం కూడా ఆవిధంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సెల్వమణి నియోజకవర్గం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చి కిలో బియ్యం తీసుకు వెళ్లాలంటూ ఆఫర్ ఇచ్చారు.

తాజాగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం ఆయన మంగళగిరి మిద్దె సెంటర్‌లో వ్యాపారులకు, వినియోగదారులకు ఉచితంగా జ్యూట్‌ చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంగళగిరిని ప్లాస్టిక్‌ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచుల వాడకం మానేసి.. జ్యూట్‌ సంచులను ఉపయోగించాలని కోరారు. ఆదివారం నుంచి మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఒక జ్యూట్‌ చేతి సంచిని అందజేస్తామని ఆయన తెలిపారు.