ఉద్యోగం ఇవ్వలేదనే  ఎయిర్ పోర్టులో బాంబు పెట్టా - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగం ఇవ్వలేదనే  ఎయిర్ పోర్టులో బాంబు పెట్టా

January 22, 2020

b bnn

కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్టులో కలకలం సృష్టించిన బాంబు అమర్చిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగును వదిలి వెళ్లిన వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మంగళూరు ఎయిర్ పోర్టులో తనకు ఉద్యోగం ఇవ్వలేదనే  మనస్తాపంతో ఇలా చేసినట్టు నిందితుడు పోలీసులకు వెల్లడించారు. మణిపాల్‌కు చెందిన ఆదిత్య రావు(36) అనే వ్యక్తి దీనికి బాధ్యత వహించడంతో అతన్ని అదుపులోకి విచారిస్తున్నారు. 

సోమవారం ఉదయం 10 గం.లకు మంగళూరు ఎయిర్ పోర్టులో టికెట్‌ కౌంటర్‌ వద్ద అనుమానస్పదంగా ఉన్న బ్యాగు కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ బ్యాగును అక్కడి నుంచి దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. బాంబ్ డిస్పోజల్ టీం బ్యాగులో  మెటల్‌ కాయిన్‌ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపినట్లుగా గుర్తించారు. వెంటనే దాన్ని జాగ్రత్తగా ఎవరూ లేని ప్రదేశంలో పేల్చేశారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి కోసం సీసీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టగా అతడే స్వయంగా లొంగిపోయాడు. బాంబు ఎయిర్ పోర్టులో పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు నిందితుడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.