ఛీ.. ఛీ.. ఎంత కక్కుర్తి.. మామిడి పండ్లు ఎత్తుకెళ్లిన జనం
తేరగా వస్తే జనం ఏది వదిలిపెట్టరని మరోసారి నిరూపించారు. మామిడి పండ్లు అమ్ముకునే వ్యక్తి ఆదమరిచి ఉన్న సమయం చూసి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దొరికిన కాడికి వాటిని దోచుకెళ్లిపోయారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యాపారి లబోదిబోమంటూ వాపోయాడు. దాదాపు రూ. 30 వేల విలువైన మామిడి మాయం అయ్యాయని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి స్కూల్ దగ్గర పండ్ల బండి పెట్టుకుని అమ్ముతూ ఉన్నాడు. ఈ క్రమంలో తోటి వ్యాపారితో చిన్న గొడవ జరిగింది. వారిద్దరూ వాదులాడుకుంటున్న సమయంలో బండి వద్ద ఎవరూ లేరు. దీంతో జనం అక్కడ గుమ్మిగూడి దొరికిన కాడికి మామిడి పండ్లు పట్టుకెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగాక వచ్చి చూడగా బండి మొత్తం ఖాళీ అయిపోయింది. మాస్కులు, హెల్మెట్లు పెట్టుకొని ఉండటంతో గుర్తించడం కష్టంగా మారింది. కొందరు హెల్మెట్‌లో పెట్టుకుని మరి వెళ్లారు. దీంతో ఆ వ్యాపారి కన్నీరు పెట్టుకున్నాడు. జనం ఇలా చేస్తారని అనుకోలేదని వాపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఏడాది మామిడి ధరలు అధికంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.