త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా మరోసారి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆయనను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. సాహా పేరును కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ప్రతిపాదించగా.. మిగిలిన సభ్యులు అంగీకరించారు. మాణిక్ సాహా వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనెల 8న త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజధాని అగర్తలలోని వివేకానంద మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాతోపాటు మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
త్రిపురలో మొత్తం 60 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది. మెజార్టీ స్థానాలను గెలుచుకున్న క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైంది. అయితే, సీఎం అభ్యర్థికి సంబంధించి మాణిక్ సాహా పట్ల ఒక వర్గం సానుకూలత వ్యక్తం చేయగా.. మాజీ సీఎం బిప్లవ్ దేబ్ మద్దతుదారులున్న మరో వర్గం కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ను పదవి వరిస్తుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠకు తెరలేపింది. అయితే, వివాద రహితుడిగా పేరు పొందడం, దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకుగానూ బీజేపీ కేంద్ర నాయకత్వం మొదటినుంచి సాహా పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి ఆయనకు అధికార పగ్గాలు దక్కాయి.
మాణిక్ సాహా జనవరి 8, 1953 లో పశ్చిమ త్రిపురలో జన్మించారు. ఆయనకు భార్య స్వప్న సాహా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బిహార్ పట్నాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బీడీఎస్, ఉత్తర్ప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో ఎండీఎస్ పూర్తి చేశారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యుడిగా, ఇండియన్ డెంటల్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. క్రీడలంటే ఎంతో మక్కువ ఉండే మాణిక్ సాహా స్వయంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన మాణిక్ సాహా పలు పతకాలు, సర్టిఫికెట్లు పొందారు. థాయిలాండ్, ఈజిప్టు, హాంకాంగ్, దుబాయి వంటి దేశాల్లో పర్యటించారు.