సంతోషం కోసం చేసుకునే మందు పార్టీలు కొన్ని సార్లు విషాదంతో ముగుస్తుంటాయి. అప్పటివరకు తోటి వ్యక్తులతో కలిసి ఎంజాయ్ చేసిన వారు హఠాన్మరణానికి గురవుతుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా దేశంలో ఇలాంటి ఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయి. తాజాగా తమిళనాడులో ఈ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా, కంట పడిన స్పెషల్ గిఫ్ట్ అతని ప్రాణం తీసింది. మరో స్నేహితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ స్పెషల్ గిఫ్ట్ విషసర్పం కావడంతో ఈ దారుణం జరిగింది. కడలూరు జిల్లాలో డిసెంబర్ 31 రాత్రి మణికందన్ అలియాస్ పప్పు అనే వ్యక్తి పాల్గొన్నాడు. మద్యం పూటుగా సేవించిన సమయంలో అటుగా వెళ్తున్న రసెల్ జాతి విష సర్పం కంటపడింది. అప్పటికే జోష్ లో ఉన్న మణికందన్ దాన్ని పట్టుకుని స్పెషల్ గిఫ్ట్ అని అరుస్తూ స్నేహితులకు చూపించాడు. కానీ రెప్పపాటులో పాము కాటు వేయడంతో వెంటనే అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే మరో స్నేహితుడిని కాటు వేయగా, భయపడిన స్నేహితులు వారిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే విషం ఎక్కడంతో మణికందన్ మార్గమధ్యంలో చనిపోగా, స్నేహితుడు చికిత్స పొందుతున్నాడు. స్పెషల్ గిఫ్ట్ అంటూ గట్టిగా అరవడంతోనే పాము బెదిరిపోయి కాటు వేసి ఉంటుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. కాగా, వ్యక్తి మరణంతో వారి నూతన సంవత్సర వేడుకలు విషాదంతో ముగిశాయి.