సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాలు తీసింది. విషపూరితమైన పామును మెడలో వేసుకొని సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుండగా అది కాటు వేయడంతో నురగలు కక్కుతూ మరణించాడు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే.. తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన మణికంఠారెడ్డి ఉపాధి కోసం కందుకూరు వచ్చి కోవూర్ రోడ్డులో ఓ జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. అతని షాపు వద్దకు పాములు ఆడించే వ్యక్తి రాగా, సరదా పడిన మణికంఠా రెడ్డి పామును మెడలో వేసుకొని సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో పాము మెడ నుంచి జారి కిందపడడంతో మణికంఠ పట్టుకునే ప్రయత్నం చేయడంతో పాము కాటు వేసింది. ఇది చూసిన స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స తీసుకుంటూ ఆస్పత్రిలోనే చనిపోయాడు. ఇలా బ్రతుకుదెరువు కోసం వేరే ఊరు వచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారి రోదన చూసి చుట్టుపక్కల వారు కంట తడి పెట్టుకున్నారు. ప్రమాదకర జీవులతో విన్యాసాలు చేయవద్దని అక్కడి వారు ఘటన పట్ల చర్చించుకోవడం కనిపించింది.