ఎక్కడన్నా బతుకు.. పెద్దయ్యాక రా అంటూ బాలుడిని రైలెక్కించిన తల్లి
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. పవిత్రమైన తల్లీ బిడ్డల బంధం అంటూ మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా దానిని సవాల్ చేసే సంఘటనలు మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా హైద్రాబాద్ మహానగరంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌కు చెందిన అంబికకు ఎనిమిదేళ్ల కుమారుడు మణికంఠ సంతానం. అయితే భర్త చనిపోవడంతో అంబిక శ్రీను అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరికి ఓ పాప పుట్టింది. ఈ క్రమంలో మణికంఠ చెప్పిన మాట వినడం లేదని, ఎదురు తిరుగుతున్నాడనే సాకుతో దంపతులిద్దరూ దారుణ చర్యకు ఒడిగట్టారు. మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషనుకి తీసుకెళ్లి భద్రాచలం వెళ్లే ప్యాసింజరు రైలు ఎక్కించారు. ‘ఎక్కడన్నా పోయి బతుకు. పెద్దయ్యాక తిరిగి రా’ అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్నారు. రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గుర్తించిన స్థానికులు స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులకు మణికంఠను అప్పగించారు. వారు వివరాలు తెలుసుకొని బుధవారం తల్లిదండ్రులను కౌన్సిలింగ్‌కి పిలిచి నచ్చజెప్పారు. అయినా వారు బాలుడిని తీసుకెళ్లడానికి నిరాకరించడంతో పోలీసులు చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు.