Manish Sisodia moves SC against arrest by CBI in Delhi liquor 'scam'; CJI to hear matter today
mictv telugu

సీబీఐ అరెస్ట్.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు సిసోదియా..

February 28, 2023

Manish Sisodia moves SC against arrest by CBI in Delhi liquor 'scam'; CJI to hear matter today

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా.. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సిసోదియా తరఫున సీనియర్‌ న్యాయవాది AM సింఘ్వీ దాఖలు చేసిన పిటిషన్‌ను.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ DY చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు విచారణ చేపడతామని తెలిపింది.

కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసి సోమవారం కోర్టు ముందు హాజరుపర్చింది. సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి పంపారు. ఐపీసీ 120 బి, 477 ఎ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద అరెస్టు చేశారు.

మరోవైపు మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మనీష్ సిసోడియా సెల్‌ఫోన్‌లు మార్చారని సీబీఐ చెబుతుందని.. అయితే అది నేరం కాదని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి కూడా సలహాలు తీసుకున్న తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామని.. దీనికి సంప్రదింపులు అవసరం కాబట్టి కుట్ర జరిగే అవకాశం లేదని న్యాయవాది చెప్పారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సిసోడియాను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ఐదు రోజుల పాటు మనీష్ సిసోడియాను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్దమైంది.