ఢిల్లీ లిక్కర్ కేసు అసలుకే ఎసరు పెట్టింది. మద్యం లైసెన్సుల మంజూరు కోసం వందల కోట్లలో ముడుపులు తీసుకుంటున్నట్లు, దందాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు జైళ్లకు వెళ్లడమే కాదు, ఉన్న పదవులూ పోగొట్టుకుంటున్నారు. ఈ కేసులో అరెస్టయిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా విధిలేని పరిస్థితిలో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. సిసోడియా ఏకంగా 18 మంత్రి పదవులు నిర్వహించడంతో అవన్నీ ఖాళీ అయ్యాయి.
మద్యం స్కాంలో అరెస్టయిన సిసోడియా ఉన్నతమైన పదవిలో ఎలా కొనసాగుతారని బీజేపీ, ఇతర విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. సత్యేంద్ర జైన్ జైల్లో విలాస జీవితం గడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కాబట్టే ఆయనకు రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణం కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ వారిద్దరితో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. కాగా, తన అరెస్ట్ అన్యాయమంటూ సిసోడియా పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ సంగతి హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇద్దరు మంత్రుల గెంటేయడంతో ఇప్పుడు ఢిల్లీ కేబినెట్లో సీఎం సహా ఐదుగురు మంత్రులే మిగిలారు. త్వరలోనే కొత్తవాళ్లతో మంత్రిమండలిని విస్తారించే అవకాశముందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.