మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (87) అనారోగ్యానికి గురయ్యారు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థత కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. నొప్పితో రావడంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి నుంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కార్డియో-థొరాసిక్ వార్డులో వైద్యం కొనసాగిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా పాల్గొన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు ఇండియాకు ప్రధాన మంత్రిగా సేవలందించారు. కాగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో పలుసార్లు కేంద్రం మంత్రిగా పని చేశారు. కరోనా పై కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తమ పార్టీ నేతలతో సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే.