మన్మోహన్ సింగ్ బయోపిక్ షురూ - MicTv.in - Telugu News
mictv telugu

మన్మోహన్ సింగ్ బయోపిక్ షురూ

April 5, 2018

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం షూటింగ్ లండన్‌లో మొదలైంది. సోనియా గాంధీ ప్రధాని పదవి వద్దనడంతో యాదృచ్ఛికంగా ప్రధాని అయిన మన్మోహన్  జీవితం, సోనియా ఆదేశాల ప్రకారం ఆయన నడుచుకోవడం వంటివి ఇందులో చూపనున్నారు. మన్మోహన్ పాత్రను నటుడు, బీజేపీ మద్దతుదారు అనుపమ్ ఖేర్ పోషిస్తున్నాడు. మాజీ ప్రధాని గెటప్‌లో ఖేర్ తీయించుకున్న ఫొటోలు మీడియాకు అందాయి.మన్మోహన్ ఒద్దికగా చేతులు జోడించినట్లు, తన కార్యాలయంలో ఒంటరిగా ఉన్నట్లు ఫొటోల్లో చూపారు. మన్మోహన్ సింగ్ గెటప్ ఖేర్‌కు నప్పలేదని నెటిజన్లు అంటున్నారు.ముఖం లావుగా ఉండడంతో ఆయన వేరే వ్యక్తిగా ఉన్నారని, గెడ్డం, కోటు వంటివి అతికిస్తే సరిపోదని పేర్కొంటున్నారు. గత ఏడాది ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే వివాదం రేగింది. సోనియాను ఒక నీడలా చూపడంపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి. మన్మోహన్‌, సోనియాల అనుమతి తీసుకున్న తర్వాతే షూటింగ్‌ పెడతామని అప్పట్లో చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. విజయ్ రత్నాకర్ గుత్తే దర్శకత్వం వహిస్తున్నారు.