హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ న్యూస్.కేరళను తొలకరి పలకరించింది. ఈ సారి రెండురోజుల ముందే పుడమితల్లి పులకరించింది. ఇక తెలంగాణని తొలకరి ఎప్పుడు పలకరిస్తుందంటే…
రెండు రోజుల ముందే నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.కేరళలో సోమవారం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. అలప్పుజా, కొట్టాయమ్ జిల్లాల్లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొచ్చిలో అయిదు సెంటీమీటర్లు, త్రిసూర్, కోజికోడ్ జిల్లాల్లో మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. మరో అయిదు రోజుల పాటు కేరళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయి.
అటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా రుతపవనాలు చేరుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మోరా తుఫాన్ వల్ల ఈశాన్య రాష్ట్రాలకు రుతుపవనాలు చేరుకున్నట్లు ఐఎండీ డైరక్టర్ జనరల్ కేజే రమేశ్ చెప్పారు. మోరా తుఫాన్ వల్ల నైరుతీ రుతుపవనాల ఆగమనం ముందుకు సాగిందన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ ఒకటవ తేదీన నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. ఈసారి రెండు రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినట్లు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని మెట్ అధికారులు అంటున్నారు.