జమ్ముకాశ్మీర్ అమర్నాథ్ యాత్రలో శుక్రవారం ఊహించని విపత్తు ఎదురైంది. కుంభవృష్టితో కురిసిన ఆకస్మిక వర్షానికి భారీ వరద పోటెత్తింది. దాంతో గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరింది. ఈ వరదాల్లో సుమారు 12 వేల మంది భక్తులు చిక్కుకుపోయారు. వరద ఉధృతికి 15 మంది మృతిచెందగా, 40 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే తన కుమార్తె వివాహం చేశారు. కుమార్తె, అల్లుడితోపాటు 11 మంది కుటుంబ సభ్యులతో ఈనెల 6న అమర్నాథ్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రద్దు కావడంతో ఢిల్లీ నుంచి మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నారు. రాత్రి అక్కడ ఓ టెంట్లో నిద్రించి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గుర్రాలపై అమర్నాథ్కు చేరుకున్నారు. ఇంతలోనే ఊహించని విధంగా కుంభవృష్టితో భారీ వర్షం కురవడంతో అక్కడున్న భక్తులు అల్లకల్లోలం అయ్యారు. ఏం చేయాలో తేలిక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ విపత్తు గురించి రాజాసింగ్ మాట్లాడుతూ.. ”శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అమర్నాథ్లో దర్శనం చేసుకొని, సుమారు అర కిలోమీటరు దూరం నడిచామో లేదో ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో కొంత దూరంలో వరద కనిపించింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. మాకు కొంచెం దూరంలోనే నా కళ్లముందే ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. ఆ దృశ్యాలను చూస్తుంటే ప్రాణాలతో బయటపడతామా? లేదా? అని చాలా భయం వేసింది. సమయానికి గుర్రాలు దొరికాయి. క్షణం ఆలోచించకుండా వాటిపై తిరుగు ప్రయాణమయ్యాం. కిందకు దిగేందుకు సుమారు మూడు గంటల సమయం పట్టింది. నాకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న విషయం తెలుసుకొని, అక్కడి పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాన్ని సమకూర్చి నన్ను, నా కుటుంబ సభ్యుల్ని శ్రీనగర్‌కు తరలించారు” అని ఆయన అన్నారు.