రోహిత్ వేముల చిత్రానికి నో ఎంట్రీ.. అందుకేనా? - MicTv.in - Telugu News
mictv telugu

రోహిత్ వేముల చిత్రానికి నో ఎంట్రీ.. అందుకేనా?

January 22, 2020

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ముంబైలో కేంద్ర ప్రభుత్వ విభాగం  ఫిల్మ్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో జరిగే ద్వైవార్షిక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు డాక్యుమెంటరీ చిత్రాలకు ఎంట్రీ లభించలేదు. వాటిలో హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్శిటీ దళిత విద్యార్థి రోహిత్‌ వేములపై తీసిన డాక్యుమెంటరీకి కూడా ఎంట్రీ లభించలేదు. 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ‘వియ్‌ హావ్‌ నాట్‌ కమ్‌ ఇయర్‌ టు డై’ పేరిట దీపా ధన్‌రాజ్‌ డాక్యుమెంటరీని తీశారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటుందని ఆ డాక్యుమెంటరీకి ఎంట్రీ దక్కలేదని వినిపిస్తోంది. ఆయన ఆత్మహత్యలో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ‘రీజన్‌’ చిత్రానికి కూడా ఎంట్రీ దొరకలేదు. ఈ చిత్రం 2018లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ‘బెస్ట్‌ ఫీచర్‌ లెన్త్‌ డాక్యుమెంటరీ అవార్డు’ను అందుకుంది. కమ్యూనిస్టు నాయకుడు గోవింద్‌ పన్సారే, హేతువాది నరేంద్ర దాభోల్కర్‌‌ను హిందుత్వ వాదులు హత్య చేయడంపై ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ పట్వర్ధన్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. 2014లో పట్వర్థన్‌కు ‘శాంతారామ్‌– జీవితకాల పురస్కారం’ అవార్డు లభించిన విషయం తెల్సిందే. దీంతోపాటు ‘షటప్‌ సోనా’కు కూడా ఎంట్రీ లభించలేదు. విశాఖపట్నంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్న గాయకురాలు, గేయ రచయిత్రి, మ్యూజిక్‌ కంపోజర్‌ సోన మొహాపాత్రపై దీప్తి గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

అవిజిత్‌ ముకుల్‌ కిషోర్‌ తీసిన ‘స్క్వీజ్‌ లైమ్‌ ఇన్‌ యువర్‌ ఐ’(కళాకారుడు కౌషిక్‌ ముఖోపాధ్యాయ్‌ డాక్యుమెంటరీ) చిత్రానికి కూడా చేదు అనుభవం ఎదురైంది. రోహన్‌ శివకుమార్‌ తీసిన ‘లవ్లీ విల్లా’, అర్చనా పాడ్కే తీసిన ‘అబౌట్‌ లవ్‌’ చిత్రాలకు కూడా ఎంట్రీ దొరకలేదు. ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాలను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

అయితే తాము ఎంపిక చేసిన 800 డాక్యుమెంటరీల గురించి  ఫిల్మ్స్‌ డివిజన్‌ డైరెక్టర్‌ జనరల్, ముంబై అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ స్మితా వాట్స్‌ శర్మ మాట్లాడుతూ.. ‘మా ఎంపిక నిష్మక్షపాతంగా జరిగింది. అందులో ఎలాంటి రాజకీయం లేదు’ అని స్పష్టంచేశారు.