నేడే మన్యం వీరుడు అల్లూరి కాంస్య విగ్రహా ఆవిష్కరణ.. - MicTv.in - Telugu News
mictv telugu

నేడే మన్యం వీరుడు అల్లూరి కాంస్య విగ్రహా ఆవిష్కరణ..

July 4, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ విగ్రహా ఆవిష్కరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

విగ్రహా ఆవిష్కరణ అనంతరం భీమవరానికి సమీపంలోని రాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొనున్నారు. మొదటగా జగన్.. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి భీమవరం చేరుకుని ప్రధాని మోదీతోపాటు కార్యక్రమంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12: 25కు భీమవరం నుంచి బయల్దేరి 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధానికి వీడ్కోలు పలికి అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోపక్క భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. చుట్టు అల్లూరి చిత్రాలతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రాలతో కూడిన భారీ కటౌట్లు, ఫెక్ల్సీలను ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టు ఆకట్టుకునే రీతిలో పుష్పలను అమర్చారు.

ఇక, అల్లూరి సీతారామరాజు గురించి తెలియని తెలుగువారు ఉండరు. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అటువంటి మహావీరుడి విగ్రహాన్ని సోమవారం ప్రధాని మోదీ, జగన్, కిషన్ రెడ్డి పలువురు నాయకులు కలిసి విగ్రహా ఆవిష్కరణ చేయనున్నారు.