భారత ప్రభుత్వానికి  మావోయిస్టుల భారీ షాక్ దేశంలో తొలి ఆఫీసు షురూ.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత ప్రభుత్వానికి  మావోయిస్టుల భారీ షాక్ దేశంలో తొలి ఆఫీసు షురూ..

December 2, 2017

50 ఏళ్లుగా తమ లక్ష్యం కోసం ప్రాణాలు ధారపోస్తూ పోరుడుతున్న మావోయిస్టులు భారత ప్రభుత్వానికి భారీ సవాలు విసిరారు. ఇంతవరకు తాత్కాలిక స్థావరాలకే పరిమితమైన నక్సల్స్ తమ ఉద్యమ చరిత్రలో తొలిసారిగా శాశ్వత క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మారుమూల అడవిలో రెడ్ కారిడార్ ఆఫీసును నిర్మించారు. దీని ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. గత ఏడాది పోలీసులు 30 మంది మావోయిస్టులను కాల్చిచంపిన ప్రాంతానికి అతి దగ్గర్లోనే ఈ కార్యాలయాన్ని నిర్మించడం వారి సత్తా ఏమిటో తెలుపుతోంది.

గిరిజనులు ఎక్కువగా ఉన్న చిత్రకొండ బ్లాకు జంత్రి పంచాయతీ తోటగూడ గ్రామం వద్ద ఈ ఎర్ర క్యాంపును నిర్మించి మొత్తం ఎర్రరంగు కొట్టారు. చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. నేటితో మొదలయ్యే ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం వారంతోత్సవాల సందర్భంగా దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. నక్సల్స్ క్యాంపు నిర్మించింది నిజమేనని, అయితే ఎందుకు కట్టారో తెలియడం లేదని పోలీసులు చెప్పారు. గత ఏడాది అక్టోబర్ లో ఏపీ, ఒడిశా పోలీసులు కూడబలుక్కుని ఈ ప్రాంతంలో 30 మంది నక్సలైట్లను చంపేశారు.