ఆడపిల్లలపై వివక్ష.. మావోయిస్టులకు వరం! - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్లలపై వివక్ష.. మావోయిస్టులకు వరం!

September 25, 2018

మావోయిస్టు పార్టీలో మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎన్‌కౌంటర్లలో చనిపోతున్న నక్సలైట్లలో అత్యధికం  మహిళలేనని తాజా లెక్కలు చెబుతున్నాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను హత్య చేసిన వారిలో మహిళా నక్సలైట్లే కీలక పాత్ర పోషించారని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 25 మంది మహిళా నక్సల్స్ వారిని చుట్టుముట్టి చంపేసినట్లు పేర్కొంటున్నారు.

మరి మావోయిస్టు పార్టీలో అంత పెద్ద సంఖ్యలో మహిళలు ఎలా చేరుతున్నారు? ప్రాణాలకు తెగించి ఎలా పోరాడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వివక్షే అంటున్నారు పోలీసులు, నక్సల్స్ సానుభూతిపరులు. గిరిజనుల్లో బాల్యవివాహాలు ఎక్కువ అని, వాటిని నుంచి తప్పించుకోవడానికి ఆడపిల్లలు మావోయిస్టు పార్టీలో చేరుతున్నారని అంటున్నారు.

Discrimination against girls gives the advantage to Maoist party recruitment recent death and Kidari murder proves

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టుల్లో మహిళలు 50 శాతం ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ గిరిజన బిడ్డలే. కిడారి హత్యలో పాల్గొన్న మహిళల వయస్సు 18 నుంచి 20 ఏళ్ల లోపు. వీరు ఛత్తీస్‌గఢ్ వాసులు. కొందరు తెలంగాణ యాసలో మాట్లాడారు. కొందరు వైజాగ్, గోదావరి ప్రాంతాల వారు. ఆడపిల్లలపై వివక్షతోపాటు మావోయిస్టుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో గిరిజనులు తమ కూతుళ్లను పార్టీలో చేర్పిస్తున్నారు. కొందరు ఆడపిల్లలు బాల్యవివాహాలను తప్పించుకోవడానికి పార్టీలో చేరుతున్నారు. వీరిని మావోయిస్టు అగ్రనేతలు మానవ రక్షణ కవచాలుగా వాడుకుంటున్నారు.

పార్టీ పొలిట్ బ్యూరో, ఇతర కీలక కమిటీల్లో మహిళలు లేరు. గతంలో కొంతమంది ఉన్నా వారికి కీలక బాధ్యతలు అప్పగించలేదు. ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారంతా గిరిజనులు కావడంతో వారిని యాక్షన్ టీమ్‌లకే పరిమితం చేస్తున్నారు.