మారన్ ‘సన్’ రాబడి 450 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

మారన్ ‘సన్’ రాబడి 450 కోట్లు

September 4, 2017

సన్ టీవీ అధిపతి మారన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆయన భార్య కావేరి ఇద్దరూ ఆ సంస్థ నుంచి ఏడాదికి రూ. 155 కోట్ల 86 లక్షలు జీతం తీసుకుంటున్నారు. ఆ విధంగా వారు దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లుగా రికార్డులకెక్కారు. 2017 ఆర్థిక సంవత్సరానికి గాను  ఒక్కొక్కరు రూ. 77 కోట్ల 93 లక్షల చొప్పున జీతం, బోనస్ కలిపి తీసుకున్నారు.  జీతం అంతకుముందు సంవత్సరం కంటే 9.04% ఎక్కువ అని, బోనస్ 11% ఎక్కువని వార్షిక ఫలితాలలో వెల్లడించారు.

సన్ టీవీ వ్యవస్థాపకుడైన కళానిధి మారన్ కు ఆ సంస్థలో ఉన్న వాటాల మీద రూ.295 కోట్ల 56 లక్షల డివిడెండ్ లభించింది. దీంతో జీతం, డివిడెండ్ కలిసి ఆ భార్యాభర్తలిద్దరికీ  సంస్థ నుంచి మొత్తం రూ. 451 కోట్ల 42 లక్షల ఆదాయం లభిస్తోంది. అదే సమయంలో సంస్థ వ్యవహారాలన్నీ చూసే సీఈవో విజయ్ కుమార్ జీతం, బోనస్ కలిపి ఏడాదికి కోటీ 17 లక్షలు. అంతకు ముందు సంవత్సరం ఆయన జీతం కోటీ 8 లక్షలు.

మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సన్ నెట్ వర్క్ మొత్తం ఆదాయం రూ.2703 కోట్ల 80 లక్షలు. అంతకు ముందు సంవత్సరం సంపాదించుకున్న రూ. 2,502 కోట్ల 75 లక్షల కంటే ఇది 8.03% ఎక్కువ.  పన్నుకు ముందు లాభం రూ. 1490 కోట్ల 35 లక్షలుండగా నిరుడు అది రూ. 1334 కోట్ల 24 లక్షలుగా నమోదైంది. పన్ను అనంతర లాభం ఈ ఏడాది రూ. 979 కోట్ల 41 లక్షలు కాగా నిరుడు అది రూ. 869 కోట్ల 69 లక్షలుగా నమోదైంది.