గంజాయి కొడుకుకు.. తల్లి సూపర్ ట్రీట్మెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

గంజాయి కొడుకుకు.. తల్లి సూపర్ ట్రీట్మెంట్

April 4, 2022

11

తన కొడుకు గంజాయికి అలవాటు పడి, రాత్రిపగలు అనే తేడా లేకుండా మత్తులో మునిగిపోతూ, ఊరిలో తమ పరువు తీస్తున్నాడని తల్లి కొడుకు కండ్లకు కారం పెట్టిన సంఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ విషయం తల్లికి తెలవడంతో గంజాయి మానుకోవాలని కొడుకును హెచ్చరించింది. అయినా, తల్లి మాటను పట్టించుకోకుండా ఆ యువకుడు గంజాయి విషయంలో తగ్గేదేలే అంటూ స్నేహితులతో కలిసి మరింతగా అలవాటుపడి, ఊరిలోని పలు గల్లీల్లో అల్లర్లు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు.

ఈ క్రమంలో ఆ యువకుడు చేస్తున్న చేష్టల గురించి కొందరు ఊరివారు తల్లికి వివరించారు. దీంతో ఆగ్రహించిన తల్లి.. కొడుకు ఇంటిలో ఉన్న సమయంలో వీధిలోకి తీసుకొచ్చి, అందరూ చూస్తుండగానే చెట్టుకు కట్టేసి, ఎర్రని కారాన్ని కండ్లలో పెట్టింది. దీంతో ఆ యువకుడు ”బోరుమని ఏడుస్తూ, అమ్మ మళ్లీ గంజాయి జోలికి పోనూ, నన్ను వదిలేయ్” అంటూ అరుపులు పెట్టాడు. అయినా, తల్లి కనికరించకుండా మరింత కారం పెడుతూ, కొడుకుకి సరైన బుద్ది చెప్పింది.

ఈ ఘటనను వీక్షిస్తున్న అక్కడివారు వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ అమ్మ మంచి పని చేశావ్. గంజాయికి అలవాటుపడి, మీ ఇంటి పరువును తీస్తున్న మీ కొడుకుకి సరైన బుద్ది చెప్పారంటూ కామెంట్స్ చేస్తున్నారు.