మేరియుపొల్‌ రష్యా వశం.. 200 మంది లొంగుబాటు - MicTv.in - Telugu News
mictv telugu

మేరియుపొల్‌ రష్యా వశం.. 200 మంది లొంగుబాటు

May 18, 2022

ఉక్రెయిన్ దేశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్దం ప్రకటించిన రోజు నుంచి నేటివరకు రష్యా సైన్యాలు తీవ్రంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని పలు ప్రధాన నగరాలను ఇప్పటికే తమ వశం చేసుకున్నాయి. తాజాగా రష్యా సైనికులు మేరియుపొల్ అనే మరో నగరాన్ని సొంతం చేసుకున్నారు. మేరియుపొలోని అజోవ్‌స్తల్ ఉక్కుకర్మాగార ప్రాంగణ బంకర్లలో తలదాచుకుంటూ, పుతిన్ సైనికులపై ప్రతిదాడులు చేస్తోన్న ఉక్రెయిన్ సైనికులు దాదాపు 200 మంది రష్యాకు సైన్యాలకు లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో అమెరికా నౌకాదళానికి చెందిన విశ్రాంత అడ్మిరల్ ఇరిక్ ఒల్సన్, బ్రిటన్‌కు చెందిన విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్, నలుగురు నాటో సైనిక శిక్షకులు ఉన్నట్లు సమాచారం. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు పుతిన్ సేనల తెలిపాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ రక్షణశాఖ ఉపమంత్రి హన్నా మలైర్ మాట్లాడుతూ..” ఉక్రెయిన్ సైనికుల ‘మిషన్ పూర్తయింది. ఇంకా అజోవ్స‌లో మిగిలి ఉన్న కొద్దిమందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. రష్యాకు చెందిన వారిని అప్పగించి, బదులుగా మా వారిని విడిపించి తీసుకువస్తాం” అని ఆయన అన్నారు