పెళ్లి చేసుకునే సమయానికి తన భార్య మేజర్ కాదంటూ ఓ వ్యక్తి నాలుగేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కాడు. తనకు ఆమెతో విడాకులు కావాలని, ఆ పెళ్లిని రద్దు చేయాలని కోరాడు. అతడి వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు.. ఆ పెళ్లిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బాధితురాలు హైకోర్టులో సవాల్ చేయగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వివాహాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని తాజాగా స్పష్టం చేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన సుశీల- మంజునాథ్ల వివాహం 2012 జూన్ 15న జరిగింది. వివాహ సమయానికి తన భార్య వయసు 18 ఏళ్లు నిండలేదని నాలుగేళ్ల తర్వాత మంజునాథ్ గుర్తించారు. ఆ పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టుకెళ్లాడు. పెళ్లయ్యే సమయానికి తన భార్య వయసు 16 ఏళ్ల 11 నెలల 8 రోజులని ఆధారాలను సమర్పించాడు. ఆయన వినతిని పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వివాహం చెల్లదని చెప్పి గత ఏడాది విడాకులు మంజూరు చేసింది. అయితే, దిగువ కోర్టు ఉత్తర్వులను అతని భార్య సుశీల హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ అలోక్ ఆరాధె, జస్టిస్ విశ్వజిత్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఇన్నేళ్లు కాపురం చేశాక అప్పటికి మైనర్ అనే కారణంగా పెళ్లిని రద్దు చేయలేమని తేల్చింది.