కట్న కానుకల విషయంలోనో.. లేదంటే ప్రేమ వ్యవహారాల కారణంగానో పీటలపై పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం. కానీ విందు భోజనంలో కోడి కూర వడ్డించలేదన్న కారణంగా.. ఓ పెళ్లి ఆగిపోయింది. విందు ముగింపు దశలో పెళ్లికుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడి తినకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య గొడవ జరిగి వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ షాపూర్‌నగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్‌కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో వీరి వివాహానికి ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. అయితే ఆడపెళ్లివారు బిహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. నానా రచ్చ చేశారు.
అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య గొడవ జరిగి వివాహం ఆగిపోయింది. వెంటనే పెళ్లికుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్‌ను కలిసి.. విషయం వివరించారు. ఆయన రెండు కుటుంబాల వారిని ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఈ నెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబీకులు నిర్ణయానికి వచ్చారు.