Married daughters also share in insurance money: High Court
mictv telugu

ఇన్సూరెన్స్ డబ్బులలో పెళ్లైన కూతుళ్లకు కూడా వాటా : హైకోర్టు

August 11, 2022

Married daughters also share in insurance money: High Court

తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ డబ్బులలో పెళ్లైన కూతుళ్లకు కూడా వాటా ఉంటుందని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు ఇవ్వడంతో పాటు పలు వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకెళితే.. 2012లో రేణుక అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. దాంతో ప్రమాదంలో చనిపోయినందున నష్టపరిహారం కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దరఖాస్తులో మృతురాలి భర్త, కుమారుడు, ముగ్గురు పెళ్లైన కూతుళ్లు అందరూ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ అందరికీ రూ. 6 లక్షల రూపాయలను 6 శాతం వడ్డీతో చెల్లించాలని ఇన్సూరెన్స్ సంస్థను ఆదేశించింది.

ఇది నచ్చని సదరు సంస్థ హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమె భర్త, కుమారుడు మాత్రమే డిపెండెంట్లు అవుతారని, ఆమె ముగ్గురు కూతుళ్లు కాదని, అందున వారికి బీమా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని వాదించింది. కానీ, హైకోర్టు సంస్థ వాదనలను తోసిపుచ్చింది. డిపెండెంట్లు అంటే ఆర్ధికంగా మాత్రమే కాదనీ, ఎమోషనల్, ఫిజికల్, సర్వీస్, సైకలాజికల్ ఇలా అనేక రకాలుగా డిపెండెన్సీ అయ్యుండవచ్చని తెలిపింది. ఈ రకంగా చూస్తే కూతుళ్లు కూడా డిపెండెంట్లే కాబట్టి వారికి డబ్బులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. పెళ్లైన కొడుకులకు హక్కు ఉంటే కూతుళ్లకు కూడా అదే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉటంకించింది.