పెళ్లైన స్త్రీలే కాదు, పెళ్లైన పురుషులపైన ఈ మధ్యకాలంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయని రీసెంట్గా ఎన్సీఆర్బీ తన నివేదికలో వెల్లడించింది. గృహ హింస వల్ల భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో తమకు ఓ జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ వివాహిత పురుషులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భర్తలు గృహహింస బాధితులుగా మారుతున్నారంటే చాలా మంది లైట్ తీసుకుంటారని, అయితే ఈ విషయం చాలా సీరియస్ అని తమకు ఓ కమిషన్ కావాలని మహేశ్ కుమార్ తివారీ అనే న్యాయవాది పిటిషన్ వేశారు.
జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకారం దేశంలో 2021లో 1,64,033 మంది ప్రమాదవశాత్తు మరణిస్తే అందులో 81,063 మంది పెళ్లయిన పురుషులని తేలింది. ఇందులో 33 శాతం మంది కుటుంబ సమస్యల కారణంగా మరణిస్తే, 4.8 శాతం మంది వివాహ సంబంధిత సమస్యలతో చనిపోయారని వెల్లడించింది.
ఈ క్రమంలో గృహహింస బాధిత పురుషుల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్ను ఆదేశించాలని పిటీషనర్ కోరారు. బాధితుల కోసం ప్రత్యేక చట్టం వచ్చే వరకు పోలీసులు వారి కేసులను స్వీకరించాలన్నారు. పెళ్లయిన పురుషుల కోసం ప్రత్యేకంగా జాతీయ పురుషుల కమిషన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.