నిత్యపెళ్లి కొడుకుకు భార్యల చేతిలో చావుదెబ్బలు
ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ ఓ వ్యక్తి నిత్యపెళ్లి కొడుకు అవతారమెత్తాడు. రెండు పెళ్లిలు చేసుకొని ఆ ముచ్చట తీరదన్నట్టుగా ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోయాడు. అతని అసలు బాగోతం బయటపడటంతో భార్యల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ఆఫీసులోంచి బయటకు లాక్కొచ్చి మరి అంతా చూస్తుండగా చితకబాదారు. తమిళనాడులోని కోయంబత్తూరు జల్లా సూలూరులో ఈ ఘటన జరిగింది.
ప్రైవేటు సంస్థలో ప్యాట్రన్ మేకర్‌గా పనిచేస్తున్న అరవింద్ దినేష్‌కు 2016లో ప్రియదర్శిని అనే యువతితో వివాహమైంది. పెళ్లయిన 15 రోజుల్లోనే వేధింపులకు గురిచేయడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి అనుప్రియను ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా అలాగే ప్రవర్తించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన దినేష్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తాజాగా అతనికి మూడో పెళ్లి చేసేందుకు ఇంట్లో వారు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన అతని ఇద్దరు భార్యలు దినేష్‌ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.