Married woman doing household work for family not akin to maid: Bombay High Court
mictv telugu

ఇంట్లో పనులు చేయమని చెప్పడం.. గృహహింస ఎలా అవుద్ది? హైకోర్టు

October 28, 2022

పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చిన మహిళకు ఇంటి పనులు చేయాలని చెప్పడం నేరం కాదని, అది హింసించడం కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సదరు మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పనిమనిషిలా చూస్తున్నారని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఓ మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. “ఒక వివాహితను ఇంటి పని చేయమని చెప్పారంటే.. అది కచ్చితంగా కుటుంబ అవసరానికై ఉంటుంది. అంతే తప్ప పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేం. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే..పెళ్లికి ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు వరుడి కుటుంబ సభ్యులు మరోసారి అలోచించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి” అని వ్యాఖ్యానించింది. తాజా కేసులో భార్య తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కేసును కొట్టివేసింది.

మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళకిది రెండో పెళ్లి. మొదటి భర్తతో కూడా ఇలాగే అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేసిందని, కోర్టు వరకూ లాగిందని రెండో భర్త, అతని తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. అప్పుడు కూడా న్యాయస్థానం.. ఆమె ఆరోపణల్లో నిజం లేదని, మొదటి భర్తను నిర్ధోషిగా తేల్చిందన్నారు.