వధువుతో బావ రొమాంటిక్ మాటలు.. పీటల మీద ఆగిన పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

వధువుతో బావ రొమాంటిక్ మాటలు.. పీటల మీద ఆగిన పెళ్లి

May 5, 2022

కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా, అక్క భర్త వధువుతో మాట్లాడిన మాటలతో ఆ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. బావా మరదళ్ల మాటలు విన్న వరుడు పెళ్లికి ససేమిరా అన్నాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేసముద్రం మండలానికి చెందిన వధువుకు బయ్యారం మండల వరుడితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఉదయం కురవి మండలంలో పెళ్లి జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా, వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్ చేశాడు.

మండపానికి ఎలా రావాలి అంటూ మంచీ చెడ్డా మాట్లాడి మరదలికి ఫోన్ ఇవ్వమని అడిగాడు. (మంగళ వారం ప్రధానం వేడుక జరుగగా, వధువు వరుడి ఇంట్లో ఉంది) దాంతో వరుడి తండ్రి కాబోయే కోడలికి ఫోన్ ఇచ్చాడు. ఫోన్‌లో వధువుతో ఆమె బావ మాట్లాడుతూ.. ‘నేను నీ మీద అలిగాను. నిన్న నీతో ఫోటో ఎందుకు దిగలేదో తెలుసా? నీ మీద కోపంతోనే దిగలేదు’ అంటూ మిగతా సంగతులన్నీ ఆగకుండా మాట్లాడేశాడు. అయితే ఆ మాటలు రికార్డవుతున్న సంగతి బావతో పాటు వధువుకు కూడా తెలియదు. కాసేపటికి ఫోన్ చేతిలో తీసుకున్న వరుడు అందులో వీరిద్దరి సంభాషణ విని వధువును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. వధువు పేరెంట్స్ పోలీసులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించినా వరుడు అంగీకరించలేదు. దీంతో అతడిని నచ్చజెప్పేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు మాత్రం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు.